
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన బాలకృష్ణుడి నిర్మాల్య దర్శనం చేసుకున్నారు.
దాదాపు 30 నిమిషాల పాటు నిర్మాల్య దర్శన సేవలో పాల్గొన్న పవన్ కల్యాణ్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గర్భాలయంలో మూలవిరాట్టుకు నిర్వహించిన ప్రత్యేక కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో తిలకించారు.
అనంతరం ఆలయంలోని వినాయకుడిని దర్శించుకున్న ఆయన.. ఆలయ సంప్రదాయాలను అనుసరిస్తూ గుడి వెనుక భాగంలో సాష్టాంగ నమస్కారం చేశారు.
తర్వాత ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి, అనంత పద్మనాభస్వామి, భగవతి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రదక్షిణలో భాగంగా అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకుని పూజలు చేశారు.
