వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే అధీకృత వినాయక మండపాలు, పందిళ్లకు 9 రోజుల పాటు ఉచిత తాత్కాలిక విద్యుత్ అందించనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు ఈ ఉచిత విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్ల వరకు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి వెల్లడించారు.

వినాయక మండపాల నిర్వాహకులు విద్యుత్ అధికారులకు అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, వైరింగ్, విద్యుత్ కనెక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

ప్రజల విశ్వాసాలకు గౌరవం ఇవ్వడం, పండుగల నిర్వహణకు సహకరించడం తమ ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని రవికుమార్ తెలిపారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని గణేష్ నవరాత్రులను ఘనంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీలను కోరారు.

సింగిల్ విండో ద్వారా అనుమతులు

మరోవైపు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌తో పాటు సింగిల్ విండో విధానంలో అనుమతులు కల్పిస్తున్నందుకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రి నారా లోకేష్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వినాయక మండపాల్లో రెండు పూటలా పూజల అనంతరం వరుణ జపం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంకల్పం, బీజాక్షర మంత్రం కరపత్రాలతో పాటు కాషాయ ధ్వజాలు, పర్యావరణహిత బ్యానర్లు, వినాయక వ్రతకల్పం పుస్తకాలను మంత్రి లోకేష్ ఆవిష్కరించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *