బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50–60 కి.మీ., దక్షిణ కోస్తా తీరం వెంబడి 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఈ జిల్లాల్లో వర్షాలు

శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత ఆదేశం

వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు అందించాలని సూచించారు.

తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు సురక్షితంగా తీరానికి చేరుకోవాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో 112, 1070, 1800 425 0101 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. రానున్న మూడు రోజులు ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *