ఘంటసాల, విద్య ద్వారానే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని, విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి వెంకట రామకృష్ణ సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా విద్యార్థులు లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

శనివారం ఘంటసాలలోని యూవీఆర్‌ గొర్రెపాటి పాఠశాలలో భారతరత్న, భారతదేశ రెండో రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌ చిత్రపటానికి గొర్రెపాటి వెంకట రామకృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్‌ లోయ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వెంకట రామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఎన్నారై గొర్రెపాటి రంగనాథబాబు తన తల్లిదండ్రులు గొర్రెపాటి ఉదయభాస్కరమ్మ, వెంకట్రాయలు పేరుతో యూవీఆర్‌ గొర్రెపాటి పాఠశాలను స్థాపించారని తెలిపారు.

ప్రిన్సిపాల్‌ లోయ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేయడం దేశానికే గర్వకారణమన్నారు. ఆయన ఆశయాలు, సేవలను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

అనంతరం పలువురు ఉపాధ్యాయినులను ఘనంగా సత్కరించి పండ్లు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *