ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సెప్టెంబర్ 7 నుంచి వారం రోజుల పాటు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మొత్తం ఎంపిక ప్రక్రియను 20 రోజుల్లో పూర్తి చేసి, అక్టోబర్ 1 నుంచి కొత్త పింఛన్లు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

2019 డిసెంబర్‌లో జారీ చేసిన 174 జీవోను ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. అనర్హులకు అడ్డుకట్ట వేసేందుకు ఆరు అంచెల తనిఖీ విధానాన్ని అమలు చేయనున్నారు. అర్హత సాధించిన వారికి కేటగిరీలు, విడతల వారీగా పింఛన్లు మంజూరు చేస్తారు. అనర్హులుగా తేలిన వారికి అందుకు గల కారణాలను కూడా తెలియజేస్తారు.

ఏయే పత్రాలు అవసరం?

అన్ని కేటగిరీల పింఛన్లకు ఆధార్ కార్డు, బియ్యం కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి.

  • వితంతు పింఛన్: భర్త మరణ ధ్రువీకరణ పత్రం, భర్త ఆధార్ నంబర్.
  • ఒంటరి మహిళ పింఛన్: వివాహితులైతే విడాకుల పత్రం; అవివాహితులైతే తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం.
  • దివ్యాంగుల పింఛన్: 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు తెలిపే సదరం ధ్రువీకరణ పత్రం.
  • చేనేత, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చర్మకారులు, కల్లుగీత కార్మికులు: సంబంధిత శాఖలు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు.
  • ట్రాన్స్‌జెండర్ పింఛన్: జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం.

ఆరు అంచెల్లో తనిఖీ

సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ లేదా సంబంధిత డేటా ప్రాసెసింగ్ సిబ్బంది దరఖాస్తులను స్వీకరిస్తారు. అవసరమైన పత్రాలతో దరఖాస్తు సమర్పించిన తర్వాత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రసీదు అందిస్తారు. అనంతరం దరఖాస్తులోని వివరాలను ఈకేవైసీ డేటాతో సరిపోల్చి పరిశీలిస్తారు.

వివరాల్లో ఏవైనా తేడాలు ఉంటే అదనపు పత్రాలు సమర్పించే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఆరు అంచెల తనిఖీతో అర్హతను నిర్ధారిస్తారు. సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలోనూ పరిశీలన చేపడతారు.

అర్హత సాధించిన వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ దరఖాస్తులు ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ లాగిన్‌కు చేరతాయి. ఒంటరి మహిళల దరఖాస్తులు తహసీల్దార్ పరిశీలనకు వెళ్తాయి. ఈ ప్రక్రియ పూర్తైన అనంతరం అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *