శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా లంక శ్యామలరావును పార్టీ అధిష్ఠానం నియమించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా ఎచ్చెర్ల సీటును బీజేపీకి కేటాయించారు. బీజేపీ అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఎచ్చెర్ల టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న కళా వెంకటరావు చీపురుపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో 2024 ఎన్నికల తర్వాత ఎచ్చెర్ల టీడీపీ ఇంఛార్జ్ పదవి ఖాళీగా ఉంది.

తాజాగా పార్టీ అధిష్ఠానం లంక శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించింది. రణస్థలం మండలం రావాడ గ్రామానికి చెందిన శ్యామలరావు టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గతంలో రణస్థలం మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు 2013 నుంచి 2018 వరకు రావాడ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఎచ్చెర్లలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని శ్యామలరావు తెలిపారు. సీనియర్ నాయకుల సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు, పార్టీ పరిశీలకులు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల ఎచ్చెర్ల ఇంఛార్జ్ ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు చేసింది. జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ పరిశీలకుడు రాధాకృష్ణ పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించి నివేదికను అధిష్ఠానానికి పంపించారు. నియోజకవర్గంలో తూర్పుకాపు సామాజికవర్గం గణనీయంగా ఉండటంతో శ్యామలరావును ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీకి ఇంఛార్జ్‌లు లేని నియోజకవర్గాలపై అధిష్ఠానం దృష్టి సారించింది. అవసరమైన చోట కొత్త ఇంఛార్జ్‌లను నియమిస్తూ.. మరికొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎచ్చెర్లకు శ్యామలరావు నియామకం జరిగింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *