
తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను ఎప్పుడైనా రాజకీయాల్లో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే.. పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు.
ఆదివారం జనసేన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తన గురించి ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నారు. తనపై జరుగుతున్న ప్రచారానికి వాస్తవాలు చెప్పేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గన్‌మెన్, తన అనుచరుల మధ్య జరిగిన గొడవపైనా ఆయన స్పందించారు. ఓ కార్యక్రమంలో గన్‌మెన్ వ్యవహరించిన తీరుపై తాను, మంత్రి కందుల దుర్గేష్ కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆ సమయంలో తాను కొంత బలంగా స్పందించిన మాట వాస్తవమేనని తెలిపారు.
అనంతరం చేతికి గాయం కావడంతో ఆసుపత్రికి వెళ్లానని, అక్కడ కార్యకర్తలు తీసిన ఫొటోలు బయటకు రావడంతో ఈ వ్యవహారం ప్రచారంలోకి వచ్చిందన్నారు. తనకు ముప్పు లేదా అనుమానం అనిపించినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వడం మాత్రమే చేశానని, స్వయంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.
తాను సొంత డబ్బుతోనే రాజకీయ కార్యక్రమాలు నిర్వహించానని, ఎవరి నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని బోనబోయిన శ్రీనివాస్ పేర్కొన్నారు.
