పారిస్‌లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ ఈఫిల్ టవర్ వద్ద చోటుచేసుకున్న వివాదం తీవ్ర చర్చకు దారితీసింది. ఓ హిందూ ప్రతినిధి బృందం పర్యటన సందర్భంగా టవర్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను విధులకు దూరంగా ఉంచినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది.

ఈ ఘటనకు నిరసనగా ఈఫిల్ టవర్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఉద్యోగులు సమ్మె చేపట్టడంతో సోమవారం పర్యాటకుల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఈఫిల్ టవర్ వద్ద సందర్శకులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.

ఈ వ్యవహారంపై ఫ్రాన్స్ ప్రభుత్వం, పారిస్ నగరపాలక సంస్థ విచారణకు ఆదేశించాయి. వివాదం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారడంతో భారత్ కూడా తొలిసారిగా ఈ అంశంపై స్పందించింది.

పారిస్‌లో BAPS (బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ సంస్థ) నూతన ఆలయ ప్రారంభోత్సవం, అనంతరం ఆ సంస్థ ప్రతినిధి బృందం ఈఫిల్ టవర్‌ను సందర్శించిన సమయంలో తలెత్తిన వివాదంపై భారత్ స్పందించింది. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించింది. అయితే, ఈ వివాదంతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఈ ఘటన పూర్తిగా సంబంధిత సంస్థల మధ్య ఉన్న అంతర్గత అంశమని విదేశాంగ శాఖ పేర్కొంది. పారిస్ ప్రాంతంలో BAPS కొత్త ఆలయాన్ని ప్రారంభించిన విషయం తమకు తెలుసని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈఫిల్ టవర్ వద్ద చోటుచేసుకున్న నిర్దిష్ట వివాదం పూర్తిగా సంబంధిత సంస్థలకు సంబంధించినదేనని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, ఆలయ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించడంపై వచ్చిన వార్తలపైనా జైస్వాల్ స్పందించారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో శుభాకాంక్షలు తెలియజేయడం ప్రభుత్వంలో సాధారణంగా కొనసాగుతున్న సంప్రదాయమేనని ఆయన పేర్కొన్నారు.

“ఇలాంటి సందర్భాల్లో ప్రధాని శుభాకాంక్షలు తెలియజేయడం సాధారణ ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో కూడా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా పాల్గొన్నారు. దీనిపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు” అని జైస్వాల్ తెలిపారు.

హిందూ ఆధ్యాత్మికవేత్తల బృందం ఈఫిల్ టవర్‌ను సందర్శించిన సమయంలో అక్కడ పనిచేస్తున్న మహిళా సిబ్బందిని తొలగించారన్న ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ ఘటనను నిరసిస్తూ అనంతరం ఈఫిల్ టవర్ సిబ్బంది ఆందోళన చేపట్టారు.

ఆధ్యాత్మిక బృందం పర్యటన సందర్భంగా మహిళా ఉద్యోగుల పట్ల లింగవివక్షకు పాల్పడటం, వారిని ప్రాంగణం నుంచి వెళ్లగొట్టడం, అలాగే వారు కనిపించకుండా దూరంగా ఉండాలని ఆదేశించడం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈఫిల్ టవర్ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *