
మరో రెండేళ్లలో ఉజ్జయినిలోని క్షిప్రా నది తీరంలో కుంభమేళా జరగనుంది. పుష్కరాల సందర్భంగా జరిగే ఈ మహా వేడుకకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి నుంచే విస్తృత ఏర్పాట్లు ప్రారంభించింది. దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి క్షిప్రా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు.
భక్తులకు మెరుగైన రవాణా, సౌకర్యాలు కల్పించేందుకు ఉజ్జయినిలో రహదారుల విస్తరణ పనులు చేపడుతున్నారు. అయితే, ఈ రహదారి విస్తరణలో భాగంగా సుమారు 170 ఏళ్ల చరిత్ర కలిగిన హనుమంతుడి ఆలయాన్ని తొలగించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో ఆలయ తొలగింపు అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.
భారీ యంత్రాలతో ప్రయత్నించినా.. కదలని హనుమ విగ్రహం!
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సుమారు 170 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన ‘ఖడే హనుమాన్’ ఆలయాన్ని తొలగించాల్సి వచ్చింది. అయితే ఆలయంలోని హనుమంతుని విగ్రహాన్ని మాత్రం అక్కడి నుంచి తరలించడం అధికారులకు సాధ్యపడలేదు.
కంఠాల్ చౌరాహా–ఛత్రీ చౌక్ రహదారిపై ఉన్న ఈ ఆలయాన్ని తొలగించిన అనంతరం విగ్రహాన్ని మరో ప్రాంతానికి తరలించేందుకు అధికారులు, సిబ్బంది నాలుగు రోజుల పాటు తీవ్రంగా శ్రమించారు. భారీ యంత్రాలను ఉపయోగించి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ.. విగ్రహం ఒక్క అంగుళం కూడా కదలకపోవడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.
2028లో జరగనున్న సింహస్థ కుంభమేళాను దృష్టిలో పెట్టుకుని ఉజ్జయిని నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా పర్వ సమయంలో క్షిప్రా నదిలో పవిత్ర స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ఉజ్జయినికి తరలివస్తారు.
ఈ నేపథ్యంలో నగరంలోని రహదారులను విస్తరించే క్రమంలో పురాతన ఖడే హనుమాన్ ఆలయాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలయాన్ని తొలగించిన అనంతరం అక్కడి హనుమ విగ్రహాన్ని టాంకీ చౌక్ సమీపంలో కొత్తగా నిర్మించనున్న ఆలయ ప్రాంగణానికి సురక్షితంగా తరలించాలని ఉజ్జయిని మునిసిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం నిర్ణయించాయి.
అయితే ఎంత ప్రయత్నించినా విగ్రహం కదలకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నాలుగు రోజుల పాటు భారీ యంత్రాలతో ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. ఈ ఘటనపై భక్తుల్లో ఆసక్తి నెలకొంది.
ఆలయాన్ని పూర్తిగా తొలగించినప్పటికీ, అక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహం మాత్రం తన స్థానాన్ని వీడలేదు. విగ్రహాన్ని తరలించేందుకు అధికారులు, సిబ్బంది జేసీబీలు, క్రేన్లతో పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్థానిక మీడియా కథనం ప్రకారం, గత కొన్ని రోజులుగా నాలుగుసార్లు చేపట్టిన ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో భారీ యంత్రాల వినియోగాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
విగ్రహం పునాది, దాని చుట్టూ ఉన్న నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం, దానికి ఎలాంటి నష్టం కలగకుండా సురక్షితంగా ఎలా తరలించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రాంతీయ దినపత్రిక ‘అమర్ ఉజాలా’ వెల్లడించింది.
