టీచర్‌ ఉద్యోగం సాధించాలన్నది ఆయన జీవిత లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎన్నో సార్లు రాత పరీక్షల్లో అర్హత సాధించి, ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కానీ ప్రతిసారీ దురదృష్టం వెంటాడింది. ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా 8 సార్లు విఫలమైనా ఆయన పట్టుదల మాత్రం తగ్గలేదు.

ప్రైవేట్‌ స్కూల్‌లో పనిచేస్తూనే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం పరీక్షలకు సిద్ధమవుతూ వచ్చారు. చివరకు 59 ఏళ్ల వయసులో ఆయన కల సాకారమైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్‌ కుమార్‌ శర్మ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకుని, ఎన్నేళ్లుగానో ఎదురుచూసిన తన లక్ష్యాన్ని సొంతం చేసుకున్నారు.

దాదాపు మూడు దశాబ్దాల నిరంతర పోరాటం.. ఎన్నో వైఫల్యాలు.. అయినా లక్ష్యాన్ని చేరుకోవాలన్న పట్టుదల మాత్రం సడలలేదు. చివరికి 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 59 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ శర్మ.

బాగ్‌పత్ జిల్లా బరౌత్ ప్రాంతంలోని బధ్వాడ్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ శర్మ.. ఎయిడెడ్ సెకండరీ పాఠశాలలో టీజీటీ (TGT) సంస్కృత ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సెప్టెంబర్ 22న లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.

1999లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారాలన్న లక్ష్యంతో శర్మ తన ప్రయత్నాలను ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 27 ఏళ్ల పాటు ఉద్యోగం కోసం నిరంతరం పరీక్షలు రాశారు. ఈ క్రమంలో ఆరుసార్లు టీజీటీ రాత పరీక్షల్లో, నాలుగుసార్లు పీజీటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. అంతేకాదు, సుమారు ఎనిమిదిసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా.. తుది ఎంపిక జాబితాలో మాత్రం చోటు దక్కలేదు.

అయితే ప్రతి వైఫల్యాన్ని ఓటమిగా భావించకుండా, మరింత పట్టుదలతో చదువుతూ తదుపరి అవకాశానికి సిద్ధమయ్యేవారు. చివరకు ఈసారి నిర్వహించిన నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ లేకుండా కేవలం రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడంతో ఆయనకు అదృష్టం కలిసొచ్చింది.

27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, 59 ఏళ్ల వయసులో తన కలను సాకారం చేసుకున్నారు విజయ్ కుమార్ శర్మ. వయసు, వైఫల్యాలు, ఎన్నో అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని వదులుకోకుండా ముందుకు సాగితే విజయం సాధించవచ్చని ఆయన ప్రయాణం మరోసారి నిరూపించింది.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో విజయ్ కుమార్ సుమారు 26 ఏళ్ల పాటు ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. వివేకానంద విద్యాపీఠ్, డూన్ పబ్లిక్ స్కూల్ వంటి పాఠశాలల్లో హిందీ, సంస్కృతం బోధించిన ఆయన.. పగటిపూట విద్యార్థులకు పాఠాలు చెబుతూ, రాత్రివేళల్లో ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు. ఈ విషయాన్ని డూన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ప్రశాంత్ జైన్ వెల్లడించారు.

విజయ్ కుమార్ తండ్రి లక్ష్మణ్ సింగ్ కూడా ఉపాధ్యాయుడే కావడం విశేషం. ఆయన కుటుంబంలోనూ విద్యారంగం, ప్రభుత్వ సేవలతో అనుబంధం కొనసాగుతోంది. విజయ్ కుమార్ ఇద్దరు కుమారులు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో పనిచేస్తుండగా, ముగ్గురు కుమార్తెలలో ఒకరు ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికై ప్రస్తుతం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు.

ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాల్లో ఎన్నోసార్లు వైఫల్యాలు ఎదురైనా విజయ్ కుమార్ మాత్రం నిరాశ చెందలేదు. ప్రతి ఓటమిని తన లోపాలను గుర్తించి, మరింత మెరుగ్గా సిద్ధమయ్యేందుకు వచ్చిన అవకాశంగానే భావించారు. ప్రయత్నాన్ని ఆపనంత వరకు వయస్సు విజయానికి అడ్డంకి కాదని ఆయన నమ్మారు.

ఆ పట్టుదలే చివరకు ఆయన లక్ష్యాన్ని చేరేలా చేసింది. 59 ఏళ్ల వయసులో, పదవీ విరమణకు చేరువైన సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం ఆయన సుదీర్ఘ ప్రయాణానికి నిదర్శనంగా నిలిచింది. వయస్సు ఎంత పెరిగినా లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఉంటే విజయం సాధ్యమేనని విజయ్ కుమార్ కథ నిరూపిస్తోంది. ఆయన పట్టుదల, క్రమశిక్షణ, ఓటములను ఎదుర్కొనే తీరూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి