
విజయవాడ, :మంత్రి నారా లోకేష్‌పై రౌడీషీట్ తెరవాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డీఎస్సీ నిరసనలకు సంబంధించి వైసీపీ నాయకులు, కార్యకర్తలపై నమోదైన కేసులను ఎత్తివేయాలని కోరుతూ శుక్రవారం వైసీపీ నేతలు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబును కలిశారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. డీఎస్సీ ఆందోళనలో జరిగిన ఘటనలతో సంబంధం లేని వారిపైనా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. కేసులు నమోదైనట్లు పోలీసులు చెబితే విచారణకు హాజరవుతామని, అయితే తమ ఇళ్లకు వచ్చి ఇబ్బందులు పెట్టవద్దని కోరారు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి కేసులు నమోదు చేయడం సరికాదని పోలీసులకు సూచించారు. కోర్టుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ పోలీసుల తీరు మారడం లేదని విమర్శించారు.
ఎస్సీ వర్గాలకు చెందిన నాయకులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయడం ఆశ్చర్యకరంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. గాదె సాయికృష్ణ కేసు విషయంలో పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ.. డీఎస్సీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమపై పోటీ చేసి గెలవాలని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వ్యవస్థలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే చివరికి అవే ప్రతికూల ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు.
