నరసాపురం, :నరసాపురం మండలం ఎర్రంశెట్టివారిపాలెం గ్రామంలో పేదల ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిని వెంటనే లబ్ధిదారులకు కేటాయించి, ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం గ్రామ శాఖ కార్యకర్తలతో కలిసి ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పంచాయతీ పరిధిలో రెండు ప్రాంతాల్లో సుమారు మూడు ఎకరాల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిందని తెలిపారు. భూమి కొనుగోలు చేసి నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారుడికీ స్థలం కేటాయించకపోవడం, ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వ విధానాన్నే కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం భూమిని కొనుగోలు చేసినా.. అక్కడికి వెళ్లేందుకు కనీసం రహదారి సౌకర్యం కూడా కల్పించకపోవడం శోచనీయమన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం పేదలకు మూడు సెంట్ల స్థలం కేటాయిస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయాలని కోరారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి, కొనుగోలు చేసిన భూమిని లబ్ధిదారులకు కేటాయించాలని కవురు పెద్దిరాజు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గుబ్బల వెంకటేశ్వరరావు, గుబ్బల నాగేశ్వరరావు, చల్లపు వెంకటేశ్వరరావు, జి. రవి, పి. లీలాప్రసాద్, జి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

By Ramya