బైక్‌ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఆశ్రయించి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. అయితే రైల్వే ద్వారా తక్కువ ఖర్చుతో బైక్‌ను పార్శిల్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ సేవను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో పొందవచ్చు. బుక్‌ చేసిన తర్వాత బైక్‌ ఎక్కడికి చేరిందో ట్రాక్‌ చేసే సదుపాయం కూడా ఉంది.

ఆన్‌లైన్‌లో ఎలా బుక్‌ చేయాలి?

రైల్వే పార్శిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ Indian Railways Parcel Portalలోకి వెళ్లి Parcel Service ఆప్షన్‌ను ఎంచుకోవాలి. Sign Up ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకుని లాగిన్‌ అయిన తర్వాత బైక్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికి పంపాలో వివరాలు నమోదు చేయాలి. దూరం, రూట్‌ ఆధారంగా ఛార్జీలు చూపిస్తారు. Forwarding Note జనరేట్‌ చేసుకుని దాని ప్రింట్‌తో బైక్‌ను రైల్వే పార్శిల్‌ కార్యాలయంలో అప్పగించాలి.

ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌..

సమీపంలోని రైల్వే స్టేషన్‌ పార్శిల్‌ కార్యాలయానికి వెళ్లి కూడా బైక్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఆధార్‌, ఒరిజినల్‌ ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి పత్రాలు అవసరం. బైక్‌లోని పెట్రోల్‌ను పూర్తిగా తొలగించిన తర్వాత బరువు, దూరాన్ని బట్టి ఛార్జీలు నిర్ణయిస్తారు. చెల్లింపు అనంతరం రైల్వే రిసిప్ట్‌ (RR) ఇస్తారు.

బైక్‌ను రవాణా సమయంలో రక్షణగా ప్యాక్‌ చేస్తారు. ఇందుకు అదనపు ఛార్జీ ఉంటుంది. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత రసీదు చూపించి బైక్‌ను తీసుకోవచ్చు. బైక్‌లో పెట్రోల్‌ ఉంచి పార్శిల్‌ చేస్తే రూ.1,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ రైల్వే పార్శిల్‌ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

By Ramya