నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాపై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ‘సాహో’, ‘ఓజీ’ వంటి చిత్రాలతో యాక్షన్ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుజీత్.. ఈసారి నానిని సరికొత్త అవతారంలో చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ విజువల్స్, విభిన్నమైన యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో నాని సరసన కథానాయికగా మీనాక్షి చౌదరి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలే నిజమైతే నాని, పృథ్వీరాజ్‌లను ఒకే తెరపై చూడటం ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. అయితే ఈ నటీనటుల వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభం.. లండన్‌లో భారీ షెడ్యూల్!

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘బ్లడీ రోమియో’ చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. తొలుత హైదరాబాద్‌లో షూటింగ్ చేపట్టి, అనంతరం లండన్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లండన్ షెడ్యూల్‌లో భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో నాని గత చిత్రాలకు భిన్నమైన మేకోవర్‌తో కనిపించనున్నారని సమాచారం. యాక్షన్‌తో పాటు వినోదానికి కూడా ప్రాధాన్యం ఇస్తూ సుజీత్ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్, నాని సొంత నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్‌పై నాని, వెంకట్ బోయినపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే సినిమా విడుదల తేదీ, నటీనటులు, సంగీత దర్శకుల వివరాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.