
బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’. రాముడి కథ అందరికీ తెలిసినదే అయినప్పటికీ, సుమారు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ఇతిహాసాన్ని తెరపై ఎలా ఆవిష్కరించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయన్న చర్చ సినిమా ప్రకటించినప్పటి నుంచే సాగుతోంది.
ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మొదటి భాగం విడుదల తేదీ విషయంలో తాజాగా ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది.
దీపావళికి ముందే ‘రామాయణ’ రిలీజ్?
మేకర్స్ తొలుత ‘రామాయణ’ మొదటి భాగాన్ని ఈ ఏడాది నవంబర్ 8న విడుదల చేయాలని భావించినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ తేదీని ముందుకు జరిపే ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 5 లేదా 6 తేదీల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దీపావళి సమయంలో ప్రేక్షకులు పండుగ వేడుకలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటారనే ఉద్దేశంతో విడుదల తేదీని ముందుకు జరిపే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ మార్పుపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు ఈ సినిమా విడుదల, పంపిణీ హక్కులకు సంబంధించి కూడా భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌తో రూ.250 కోట్ల నుంచి రూ.350 కోట్ల మధ్య డీల్ కుదిరినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.
మిస్టర్ బీస్ట్‌తో ప్రమోషన్స్.. పాన్ వరల్డ్‌పై కన్ను!
‘రామాయణ’ చిత్రబృందం సినిమా ప్రచారంలోనూ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్లతో ప్రమోషన్స్ నిర్వహించే విధానానికి భిన్నంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యూట్యూబ్ సబ్స్క్రైబర్లు కలిగిన క్రియేటర్లలో ఒకరైన మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డొనాల్డ్సన్) కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతకుముందు కూడా పలువురు కంటెంట్ క్రియేటర్లతో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
యువత, ముఖ్యంగా జెన్ జీ ప్రేక్షకులను ఆకర్షించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో సినిమాపై ఆసక్తి పెంచేందుకు ఈ తరహా ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నట్లు సమాచారం. ప్రమోషన్స్ కోసమే సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, అంతర్జాతీయ స్థాయి ప్రచారంతో ‘రామాయణ’పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరి ఈ సినిమా విడుదల తేదీపై ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుంది? భారీ పెట్టుబడులకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుంది? అనేది వేచి చూడాలి.
