
బాక్సింగ్ నేపథ్యంలో 1970ల నాటి ఎమర్జెన్సీ కాలం పరిస్థితులను జోడించి తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్ట పరంబరై’. 2021లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆర్య ప్రధాన పాత్రలో నటించారు.
బాక్సింగ్‌పై మక్కువ ఉన్న యువకుడిగా, తల్లి మాటకు ఎంతో విలువ ఇచ్చే కుమారుడిగా ఆర్య తన నటనతో ఆకట్టుకున్నారు. అప్పటి బాక్సింగ్ వాతావరణం, సంస్కృతిని తెరపై సహజంగా ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
‘సార్పట్ట 2’ షూటింగ్ ప్రారంభం
తొలి భాగానికి కొనసాగింపుగా ‘సార్పట్ట 2’ తెరకెక్కనున్నట్లు ఇటీవల చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సీక్వెల్ షూటింగ్‌ను ప్రారంభించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఓ ఫొటోను కూడా షేర్ చేశారు.
“సార్పట్ట ఆవిర్భావం మొదలైంది.. రెండో రౌండ్ షురూ అయ్యింది” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించారు. దీంతో సార్పట్ట అభిమానుల్లో మరోసారి ఉత్సాహం నెలకొంది.
మొదటి భాగంతో ఆకట్టుకున్న పా.రంజిత్.. సీక్వెల్‌ను ఏ స్థాయిలో తెరకెక్కించబోతున్నారనే ఆసక్తి నెలకొంది. మరోవైపు ‘సార్పట్ట 2’లో కథ ఎలా ఉండబోతోంది? ఆర్య పాత్రను ఏ విధంగా చూపించబోతున్నారు? అనే విషయాలపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది.
