ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి కలిసి పర్యటించనున్నారు. అక్టోబర్ 5న కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఇద్దరూ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

పులివెందుల పర్యటనలో భాగంగా లింగాల మండలం పార్నపల్లె సమీపంలో నిర్మించిన నూతన తాగునీటి పథకాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. అనంతరం ఎన్నో ఏళ్లుగా ఇళ్లపై యాజమాన్య హక్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న పేదలకు శాశ్వత పట్టాలను పంపిణీ చేయనున్నారు.

డీకేటీ, ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న కుటుంబాలతో పాటు జయమ్మ కాలనీ, రాజారెడ్డి కాలనీల్లో నివసిస్తున్న దాదాపు 4 వేల కుటుంబాలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. అర్హులైన లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు

సీఎం, డిప్యూటీ సీఎం పులివెందుల పర్యటన నేపథ్యంలో కడప జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సవిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. భద్రత, కార్యక్రమ నిర్వహణతో పాటు రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, పార్కింగ్ వంటి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. తొలుత సెప్టెంబర్ 30న పులివెందుల పర్యటన ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ.. తాజాగా అక్టోబర్ 5న పర్యటన ఖరారైనట్లు అధికారులు తెలిపారు.

ఇళ్లపై యాజమాన్య హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని పులివెందులలోని పలువురు పేదలు చాలాకాలంగా అధికారులను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా శాశ్వత పట్టాల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

By Ramya