వెబ్ డెస్క్: పండుగల సీజన్‌ ప్రారంభంలో హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్‌ వ్యాపారులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను అక్టోబర్ 1 నుంచి పెంచాయి. నగరాన్ని బట్టి సిలిండర్‌పై రూ.62.50 నుంచి రూ.71.50 వరకు ధర పెరిగింది.
ప్రధాన నగరాల్లో కొత్త ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.62.50 పెరిగి రూ.2,810కి చేరింది. ముంబైలో రూ.63.50 పెంపుతో రూ.2,764.50, చెన్నైలో రూ.66.50 పెరిగి రూ.2,983కి చేరింది. పట్నాలో అత్యధికంగా రూ.71.50 పెరగడంతో ధర రూ.3,100.50కి చేరింది.
ఈ పెంపు ప్రభావం ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ సంస్థలు, స్వీట్స్ షాపులు, ఇతర వాణిజ్య సంస్థలపై పడనుంది. పండుగల సమయంలో వంటగ్యాస్ వినియోగం పెరిగే నేపథ్యంలో వ్యాపార నిర్వహణ ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది.
గృహ వినియోగదారులకు ఊరట
అయితే సాధారణ గృహ వినియోగదారులకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ప్రస్తుతం గృహ వినియోగదారులకు ఈ ధరల పెంపు నుంచి ఊరట లభించింది.
ఇంధన రంగంలోనూ మార్పులు
ఇదిలా ఉండగా.. అక్టోబర్ 1 నుంచి విమాన ఇంధనం (ATF) ధర లీటర్‌కు రూ.16 పెరిగి రూ.137కి చేరింది. మరోవైపు డీజిల్, ATF ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ ట్యాక్స్‌లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది.

By Ramya