
నెల్లూరు జిల్లాలోని పొట్టేపాళెం వద్ద ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న వంతెన సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. సుమారు రూ.6.54 కోట్ల వ్యయంతో నిర్మించిన కలుజుపై వంతెనను శుక్రవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. వంతెన అందుబాటులోకి రావడంతో నాలుగు నియోజకవర్గాల ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి.
వంతెన ప్రారంభోత్సవంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు తుఫాన్లను ఎదుర్కొన్నామని తెలిపారు. ఆ సమయంలో కలుజు వద్ద ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశానన్నారు. కేవలం 11 నెలల్లోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషమని పేర్కొన్నారు.
ఈ రోజు చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించదగిన రోజని అన్నారు. వంతెన నిర్మాణం కోసం కోటంరెడ్డి సోదరులు పట్టుదలతో కృషి చేశారని ప్రశంసించారు. రూరల్ నియోజకవర్గంలో రూ.966 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వీటిలో చాలా పనులు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వంతెన సమస్యపై అసెంబ్లీలో పలుమార్లు గళం వినిపించానని గుర్తుచేశారు.
అప్పటి ముఖ్యమంత్రి జగన్ను స్వయంగా తీసుకువచ్చి సమస్యను చూపించినప్పటికీ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చి నిధులు కేటాయించలేదని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయ అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ ఆదేశించడంతో పాటు తన తండ్రి నిర్ణయిస్తే మేయర్ లేదా జెడ్పీ ఛైర్మన్ పదవికి పోటీ చేస్తానని చెప్పారు. వంతెన నిర్మాణం కోసం తన తండ్రి ఎంతో శ్రమించారని తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో వంతెన నిర్మాణంపై ప్రశ్నించిన వారినే ఇప్పుడు ప్రారంభోత్సవానికి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఐదు దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉందని సాయి వైష్ణవి అన్నారు.
