
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డుకు (ORR) కీలక ముందడుగు పడింది. నిర్మాణ పనులకు జాతీయ రహదారుల సంస్థ (NHAI) టెండర్లు ఆహ్వానించింది. మొత్తం నాలుగు ప్యాకేజీలుగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు నవంబరు 18 ఉదయం 11 గంటల వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. నవంబరు 19న టెండర్లు తెరవనున్నారు.
అమరావతి ORRను 189.93 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో నిర్మించనున్నారు. నారాకోడూరు నుంచి గుంటూరు శివారు బుడంపాడు వరకు మరో 5.2 కిలోమీటర్ల నాలుగు వరుసల స్పర్ రోడ్డును నిర్మిస్తారు. దీంతో మొత్తం పొడవు 195.13 కిలోమీటర్లకు చేరుతుంది. సివిల్ పనుల అంచనా వ్యయం రూ.11,537 కోట్లు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రభుత్వం నిర్మాణ వ్యయంలో 40 శాతాన్ని దశలవారీగా చెల్లించనుండగా.. మిగిలిన 60 శాతాన్ని కాంట్రాక్టు సంస్థ సమకూర్చుకోవాలి. ఆ మొత్తాన్ని ప్రభుత్వం 10-15 ఏళ్లలో వడ్డీతో సహా చెల్లిస్తుంది.
ఈ ORR గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని 23 మండలాలు, 97 గ్రామాల మీదుగా సాగనుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా రహదారిని డిజైన్ చేశారు. ఆరు జాతీయ రహదారులు, ఏడు రాష్ట్ర రహదారులు, ఒక జిల్లా రహదారిని ఇది కలుపుతుంది.
ప్రాజెక్టులో మూడు సొరంగాలు, కృష్ణా నదిపై రెండు వంతెనలు, 20 పెద్ద, 95 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. గ్రామాల రాకపోకలకు 105 అండర్‌పాస్‌లు, ఎనిమిది రోడ్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తారు.
ORR కోసం ఐదు జిల్లాల్లో మొత్తం 3,251.41 హెక్టార్ల భూసేకరణ చేపడుతున్నారు. ఇందుకు ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
