ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు రైల్వే లైన్‌లో చివరి ప్యాకేజీ పనులకు రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది. వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి రూ.599.33 కోట్ల అంచనా వ్యయంతో బిడ్లను ఆహ్వానించారు.

ఈ-ప్రొక్యూర్‌మెంట్ (EPP) విధానంలో చేపట్టనున్న ఈ పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నవంబర్ 23 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చినట్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు తెలిపారు.

నాలుగు ప్యాకేజీలుగా రైల్వే లైన్ నిర్మాణం

ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు రైల్వే లైన్ మొత్తం 58.10 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా విభజించారు.

మొదటి ప్యాకేజీలో తెలంగాణలోని ఖమ్మం జిల్లా పరిధిలో ఎర్రుపాలెం నుంచి పెద్దాపురం సమీపం వరకు సుమారు 3.5 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించనున్నారు. రెండో ప్యాకేజీలో పెద్దాపురం నుంచి కృష్ణా నది వరకు, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో పనులు చేపట్టనున్నారు.

మూడో ప్యాకేజీలో కృష్ణా నదిపై 3.23 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెనతో పాటు పల్నాడు జిల్లా పరిధిలోని వడ్డమాను వరకు లైన్ నిర్మాణ పనులు ఉంటాయి. ఈ మూడు ప్యాకేజీలకు ఇప్పటికే టెండర్లు పిలిచిన రైల్వే శాఖ.. తాజాగా చివరి ప్యాకేజీకి కూడా బిడ్లను ఆహ్వానించింది.

అమరావతికి రైలు కనెక్టివిటీ

రాజధాని అమరావతి ప్రాంతంలో రహదారులు, ప్రభుత్వ భవనాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధితో పాటు రైల్వే కనెక్టివిటీని కూడా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు రైల్వే లైన్ పూర్తయితే రాజధాని ప్రాంతానికి రైలు రవాణా మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు కొత్త రైల్వే ప్రాజెక్టులు, లైన్ విస్తరణ పనులకు టెండర్లు ప్రక్రియలో ఉండగా.. అమరావతి రైల్వే లైన్‌లో నాలుగో ప్యాకేజీకి తాజాగా టెండర్లు ఆహ్వానించడం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ముందడుగుగా అధికారులు భావిస్తున్నారు.

By Ramya