
దసరా పండుగ సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఈసారి మరింత ఆసక్తికరంగా మారనుంది. పండుగ సెలవులను క్యాష్ చేసుకునేందుకు నాలుగు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 9న వెంకటేశ్ నటించిన ‘ఆదర్శకుటుంబం’, శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ విడుదల కానుండగా.. అక్టోబర్ 15న రజనీకాంత్ ‘జైలర్ 2’, అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. భిన్నమైన కథాంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.
అక్టోబర్ 9న రెండు సినిమాలు
దసరా రేసులో ముందుగా విక్టరీ వెంకటేశ్ అడుగుపెట్టనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శకుటుంబం’లో ఫ్యామిలీ ఎంటర్టైనర్కు తనదైన స్టైల్‌తో పాటు స్వల్ప క్రైమ్ టచ్‌ను జోడించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9న ఈ సినిమా విడుదల కానుంది. అయితే రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్నా.. సినిమాపై ఆశించిన స్థాయిలో హైప్ కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అదే రోజున శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నక్సలిజం నేపథ్యాన్ని తీసుకుని దానికి కామెడీ అంశాలను జోడించి తెరకెక్కించిన ఈ సినిమా కూడా విభిన్నమైన కథతో వస్తోంది. అయితే ప్రమోషన్స్ పరంగా ఇప్పటివరకు పెద్దగా సందడి కనిపించకపోవడం గమనార్హం.
‘జైలర్ 2’పై భారీ అంచనాలు
దసరా రేసులో అసలు హైప్ ఉన్న సినిమాగా రజనీకాంత్ ‘జైలర్ 2’ కనిపిస్తోంది. అక్టోబర్ 15న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ ఘన విజయం సాధించడంతో.. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మొదటి భాగాన్ని మించి యాక్షన్, ఎంటర్టైన్మెంట్తో ఈ సీక్వెల్‌ను దర్శకుడు నెల్సన్ రూపొందించినట్లు తెలుస్తోంది. దసరా సినిమాల్లో ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న చిత్రం ఇదే.
విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై ఆసక్తి
ఇక అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’తో బరిలోకి దిగుతున్నారు. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. కాంబినేషన్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ.. సినిమాకు ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో బజ్ రాలేదనే టాక్ ఉంది.
మొత్తంగా దసరా బాక్సాఫీస్ బరిలో నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. రిలీజ్ తర్వాత ఏ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది? ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
