చిలకలూరిపేట: పట్టణ పరిధిలోని బోసు రోడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన పేదల రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని అధికారులు శనివారం సాయంత్రం జరిపిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బోసు రోడ్డులోని ఒక ఎరువుల గోడౌన్ వెనుక భాగంలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 12 బస్తాల్లో ఉన్న సుమారు 6 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ నిల్వలకు కారణమైన తన్నీరు నాగమ్మ అనే మహిళపై 6-ఏ (6-A) కేసు నమోదు చేశారు.

పల్నాడు జిల్లా అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ షేక్ రోషన్ జమీర్ భాష, డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్లు, వీఆర్వో షేక్ మస్తాన్ సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పేదలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా లేదా బ్లాక్ మార్కెట్‌‌కు తరలించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

By Ramya