
జంగారెడ్డిగూడెం, విద్య ద్వారానే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. పాఠ్యాంశాలతో పాటు సామాజిక, వైజ్ఞానిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.
బుధవారం జంగారెడ్డిగూడెంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, ఆహారం, నిత్యావసర సరుకుల నిల్వ, మెనూ, మరుగుదొడ్లు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న బోధన, విద్యా ప్రమాణాలను సమీక్షించారు.
తనిఖీలో భాగంగా కలెక్టర్ స్వయంగా విద్యార్థులకు పాఠాలు బోధించి, వారిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాల పరిసరాల పరిశుభ్రత, ఆహార నాణ్యత, మౌలిక వసతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు, వసతిగృహ సిబ్బంది అంకితభావంతో పనిచేసి విద్యార్థులను ఉత్తమ ఫలితాల దిశగా ప్రోత్సహించాలని సూచించారు.
ప్రతి విద్యార్థిని సొంత పిల్లలుగా భావించి వారి విద్య, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. హాజరు శాతం, విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, మౌలిక వసతుల అమలును పక్కాగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పాఠశాల ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేందుకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
