
భారత వైమానిక దళ వీరుడు, గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. కమర్షియల్ పైలట్‌గా మారిన ఆయన, ప్రముఖ ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ఫ్లై91’లో చేరారు. ప్రస్తుతం గోవా–హైదరాబాద్ సెక్టార్‌లో ఏటీఆర్ టర్బోప్రాప్ విమానాలను నడిపేందుకు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.
2019లో బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం పాకిస్థాన్‌తో జరిగిన వైమానిక ఘర్షణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన అభినందన్‌కు భారత ప్రభుత్వం ‘వీర్ చక్ర’ పురస్కారాన్ని అందించింది. సైనిక సేవల అనంతరం కొత్త కెరీర్‌ను ఎంచుకున్న ఆయన, ఎలాంటి ప్రచార ఆర్భాటానికి దూరంగా ఉంటూ తన తొలి కమర్షియల్ విమాన ప్రయాణానికి సంబంధించిన వివరాలను కూడా అత్యంత గోప్యంగా ఉంచడం విశేషం.
భారతదేశంలో ప్రముఖ ఫైటర్ పైలట్‌గా గుర్తింపు పొందిన గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్‌లను నడిపిన ఆయన.. తాజాగా కమర్షియల్ పైలట్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.
రీజినల్ ఎయిర్‌లైన్ ‘ఫ్లై91’లో కమర్షియల్ పైలట్‌గా చేరిన అభినందన్ ప్రస్తుతం గోవా–హైదరాబాద్ మార్గంలో శిక్షణ పొందుతున్నారు. అవసరమైన నియంత్రణ అనుమతులు లభించిన తర్వాత ఆయన ATR టర్బోప్రాప్ విమానాలను నడపనున్నారు.
అయితే అభినందన్ తన తొలి కమర్షియల్ విమాన ప్రయాణానికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచాలని ఎయిర్‌లైన్‌ను కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన మొదటి విమానం ఎప్పుడు, ఏ మార్గంలో ఉంటుందనే వివరాలను వెల్లడించవద్దని సూచించినట్లు సమాచారం.
1983 జూన్ 21న చెన్నైలో జన్మించిన అభినందన్.. అమరావతి నగర్‌లోని సైనిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి, అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో శిక్షణ పొందారు. 2004 జూన్‌లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా చేరిన ఆయన.. సుఖోయ్ సూ-30 ఎంకేఐ, మిగ్-21 బైసన్ స్క్వాడ్రన్లలో సేవలందించారు.
2019 ఫిబ్రవరి 27న బాలాకోట్ వైమానిక దాడుల మరుసటి రోజు పాకిస్థాన్ జెట్‌లతో జరిగిన గగనతల పోరులో అభినందన్ నడుపుతున్న మిగ్-21 విమానం కూలిపోయింది. దీంతో ఆయన పారాచూట్ ద్వారా పాకిస్థాన్ భూభాగంలో దిగగా.. అక్కడి సైన్యం ఆయనను అదుపులోకి తీసుకుంది. సుమారు మూడు రోజుల పాటు పాకిస్థాన్ చెరలో ఉన్నప్పటికీ, గాయపడిన స్థితిలోనూ కెమెరా ముందు ఆయన ప్రదర్శించిన నిగ్రహం, ధైర్యం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
అనంతరం 2019 మార్చి 1న అభినందన్‌ను పాకిస్థాన్ విడుదల చేసింది. దేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతదేశ మూడో అత్యున్నత సైనిక పురస్కారమైన ‘వీర్ చక్ర’ను ప్రదానం చేశారు. 2021 డిసెంబర్‌లో ఆయన గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి పొందారు.
