
ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా దౌర్జన్యాలు పెరిగిపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అధికార పార్టీ నేతల కంటే పోలీసులు ఎక్కువగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని రామకృష్ణ మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో గతంతో పోలిస్తే నాలుగు రెట్లు అధికంగా దౌర్జన్యాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికలు చంద్రబాబు ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ప్రజలకు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజలు ఎన్నికల నిర్వహణపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డబ్బులు చెల్లిస్తేనే ఓటు వేసే సంస్కృతిని ప్రస్తుత ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో పెరిగిపోతున్న ఈ విష సంస్కృతిని తరిమికొట్టేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని అన్ని రంగాలు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు.




