రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కీలక అప్‌డేట్. ఏపీపీఎస్సీ గత నెలలో ప్రకటించిన 160 లెక్చరర్ పోస్టుల పూర్తి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. నవంబర్ 18 నుంచి ప్రారంభం కావాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలుకాలేదు. సీనియర్ డైట్ లెక్చరర్, ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్, డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు తేదీల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో కీలక అప్‌డేట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గత నెలలో విడుదల చేసిన లెక్చరర్ పోస్టుల సంక్షిప్త ప్రకటనకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. అలాగే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. దీంతో ఈ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. APPSC విడుదల చేసిన సంక్షిప్త ప్రకటన ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ పరిధిలో మొత్తం 160 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సీనియర్ డైట్ లెక్చరర్, ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్, డైట్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా..
- సీనియర్ డైట్ లెక్చరర్: 46 పోస్టులు
- లెక్చరర్ ఎస్‌సీఈఆర్‌టీ: 10 పోస్టులు
- డైట్ లెక్చరర్: 104 పోస్టులు
సంక్షిప్త ప్రకటనలో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 18 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు పూర్తి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభం కాలేదు. దీంతో అభ్యర్థుల్లో కొంత అయోమయం నెలకొంది. పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, పరీక్ష విధానం, ఇతర ముఖ్యమైన వివరాలపై స్పష్టత రానుంది. అలాగే దరఖాస్తుల ప్రారంభ, ముగింపు తేదీలను కూడా కమిషన్ వెల్లడించనుంది. ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో లెక్చరర్ ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.




