ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 4,244 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఫేజ్-3 ఎన్నికలు 46 రెవెన్యూ డివిజన్లు, 214 మండలాల పరిధిలో జరగనున్నాయి.

ఈ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ పదవులకు రెండు రోజుల్లో మొత్తం 16,505 నామినేషన్లు దాఖలయ్యాయి. నవంబర్ 21న మొదటి రోజు 4,929 నామినేషన్లు నమోదు కాగా నవంబర్ 22న రెండో రోజు ఏకంగా 11,576 నామినేషన్లు వచ్చాయి. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగింది.

ఇక వార్డు సభ్యుల పదవులకు కూడా అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించింది. రెండు రోజుల్లో మొత్తం 60,420 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 13,611 నామినేషన్లు రాగా రెండో రోజు 46,809 నామినేషన్లు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా చూస్తే సర్పంచ్ నామినేషన్లలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 1,336 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 1,092, విజయనగరంలో 930, మార్కాపురంలో 908, వైఎస్ఆర్ కడప జిల్లాలో 905 నామినేషన్లు నమోదయ్యాయి.

మరోవైపు వార్డు సభ్యుల నామినేషన్లలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 4,892 నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రీకాకుళంలో 4,661, విజయనగరంలో 4,429, అనకాపల్లిలో 3,748, కాకినాడలో 3,559 నామినేషన్లు నమోదయ్యాయి.

మొత్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతుండటంతో ఎన్నికల సందడి గ్రామాల్లో ఊపందుకుంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *