
దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో భారీ సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, అస్సాం, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల పోలీసు బలగాలు కలిసి నిర్వహించిన ‘ఆపరేషన్ ట్రైడెంట్’ ద్వారా అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్, నార్కో-టెర్రరిజం నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక వివరాలను వెలికితీసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భారత్, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులకు అనుసంధానమైన ప్రాంతాల్లో క్రియాశీలంగా ఉన్న డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
38 ప్రాంతాల్లో మెరుపు దాడులు
అస్సాం, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లోని 38 కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో డ్రగ్స్ ముఠాలకు సంబంధించినవిగా గుర్తించిన సుమారు రూ.100 కోట్ల హవాలా లావాదేవీలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ముఠాలకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 1,424 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.
ఈ దాడుల్లో రూ.17.82 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడంతోపాటు రూ.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, 500 డిటోనేటర్లను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ చర్యలతో డ్రగ్స్ అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించే నెట్‌వర్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అధికారులు పేర్కొన్నారు.
అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు చెందిన 18 మంది అరెస్ట్
ఆపరేషన్‌లో భాగంగా అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హవాలా లావాదేవీలు, పేలుడు పదార్థాల స్వాధీనం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యం
దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 2029 డిసెంబర్ 31 నాటికి దేశంలోని డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నిర్మూలించాలనే లక్ష్యంతో ‘మిషన్ 2029’ చేపట్టినట్లు తెలిపారు.
“మాదకద్రవ్యాల శవపేటికలో చివరి మేకు దిగే వరకు భారతదేశం తన పోరాటాన్ని కొనసాగిస్తుంది” అని అమిత్ షా పేర్కొన్నారు. ఆపరేషన్ ట్రైడెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ఏజెన్సీలు, అస్సాం, మిజోరం, మణిపూర్ పోలీసు బలగాలను ఆయన అభినందించారు.
దేశ యువతను మాదకద్రవ్యాల ముప్పు నుంచి రక్షించడంతోపాటు డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా సాగుతున్న నేర కార్యకలాపాలను అరికట్టేందుకు మరింత సమన్వయంతో చర్యలు కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
