ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్‌’ 139వ ఎపిసోడ్‌లో దేశాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్న ప్రజల సేవలను ప్రశంసించారు. సమాజంలో సానుకూల మార్పులకు కృషి చేస్తున్న వ్యక్తులు సంస్థల సేవలను గుర్తించి వాటిని ప్రజలకు పరిచయం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. 12 ఏళ్ల క్రితం విజయదశమి రోజున ప్రారంభమైన ‘మన్ కీ బాత్‌’ ప్రయాణాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు.

దేశ సమష్టి శక్తికి ప్రతీక అయిన ‘లోక్‌ శక్తి’కి ఈ వేదిక ద్వారా ప్రణామం చేస్తున్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా కుటుంబాలతో అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తోందన్నారు. తాను తమ కుటుంబ సభ్యుడిలా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందని అనేకమంది శ్రోతలు చెప్పడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రజల ప్రేమాభిమానాలు వారితో ఏర్పడిన అనుబంధం తనకు వెలకట్టలేని సంపద అని అన్నారు.

సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం

సేంద్రియ వ్యవసాయం సంప్రదాయ సాగు పద్ధతులను ప్రోత్సహిస్తున్న పంజాబ్‌కు చెందిన ‘ఖేతీ విరాసత్ మిషన్‌’ కృషిని ప్రధానమంత్రి అభినందించారు. మాల్వా ప్రాంతంలో సహజ పద్ధతుల్లో పత్తి సాగును ప్రోత్సహిస్తున్న ‘నవ్‌-త్రింజన్‌’ కార్యక్రమాన్ని కూడా ప్రశంసించారు. ప్రజలు తమ రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకోవాలని సూచించారు.

అవయవదానంతో ప్రాణాలకు రక్షణ

అవయవదానం ప్రాణాలను కాపాడటంతోపాటు వైద్య పరిశోధనల అభివృద్ధికి దోహదపడుతుందని మోదీ పేర్కొన్నారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు ఈ మహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

బ్రెయిన్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీపై ఐఐటీ మద్రాస్‌కు ప్రశంసలు

‘పరమ్‌ శక్తి’ సూపర్‌ కంప్యూటర్‌ను ఉపయోగించి బ్రెయిన్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సాంకేతిక వేదిక ద్వారా అధిక రిజల్యూషన్‌తో కూడిన డిజిటల్‌ 3డీ చిత్రాలను రూపొందించవచ్చని 100 మానవ మెదళ్లను సమగ్రంగా అధ్యయనం చేసే సామర్థ్యం ఉందని వివరించారు. అలాగే ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో ‘ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు’ పోషిస్తున్న పాత్రను ప్రస్తావించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *