డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మరో గుర్తింపు దక్కింది. పిఠాపురం ప్రాంత అభివృద్ధి అథారిటీ (పాడా)ను స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ప్రభుత్వం గుర్తించింది. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ పరిధిలో పనిచేసే పాడాకు కాకినాడ జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం, సమగ్ర ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం, పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం పాడా ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి.

పాడా పరిధిలో 52 గ్రామ పంచాయతీలు

పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలను కలిపి ప్రభుత్వం పాడాను ఏర్పాటు చేసింది. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలతో పాటు పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల్లోని 52 గ్రామ పంచాయతీలు పాడా పరిధిలోకి వస్తాయి.

‘ప్రాజెక్ట్ డైరెక్టర్, పాడా, పిఠాపురం’ పేరుతో సంస్థాగత కోడ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రస్థాయి సాంకేతిక సేవలు పొందేందుకు అవసరమైన సదుపాయాలతో పాటు హెచ్‌ఆర్‌ఎంఎస్ కోడ్‌ను కూడా మంజూరు చేసింది.

రూ.308 కోట్లతో అభివృద్ధి పనులు

పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.308.24 కోట్ల విలువైన పనులు చేపట్టారు. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో పాటు తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనులు జరుగుతున్నాయి.

పట్టణంలో సుమారు 120 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారానికి కూడా చర్యలు చేపడుతున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *