ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి 45వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీడీపీ, కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

వివాహ వార్షికోత్సవం సందర్భంగా నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబుకు సోషల్ మీడియా ద్వారా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 45 ఏళ్ల వైవాహిక ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు, స్నేహం, సాన్నిహిత్యం తమ జీవితాన్ని ప్రత్యేకంగా మార్చాయని పేర్కొన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది వివాహ వార్షికోత్సవ ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? అంటూ సరదాగా ప్రశ్నించారు.

భువనేశ్వరి ట్వీట్‌కు చంద్రబాబు కూడా ప్రేమగా స్పందించారు. ప్రజలు తనను ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడిగా పిలిచినా.. తనకు అత్యంత ఇష్టమైన, గర్వంగా భావించే ‘భర్త’ అనే హోదాను ఇచ్చినందుకు భువనేశ్వరికి ధన్యవాదాలు తెలిపారు. జీవిత ప్రయాణంలో చివరి వరకు ఆమెతో కలిసి అడుగులు వేయడమే తన ఏకైక ప్రమాణమని పేర్కొన్నారు.

ఇక చంద్రబాబు-భువనేశ్వరి దంపతులకు మంత్రి నారా లోకేశ్ కూడా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితం, రాజకీయాలు, విజయాలు, సవాళ్లు వంటి ఎన్నో సందర్భాల్లో భాగస్వామ్యం అంటే ఏమిటో తమ తల్లిదండ్రులు చూపించారని అన్నారు. వారు మరెన్నో సంవత్సరాలు కలిసి సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు.

లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. 45 ఏళ్ల ప్రేమ, నవ్వులు, అనుబంధంతో సాగిన వారి ప్రయాణంలో తాము భాగస్వాములుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

చంద్రబాబు-భువనేశ్వరి దంపతుల మధ్య ఉన్న ప్రేమ, పరస్పర గౌరవాన్ని ప్రస్తావిస్తూ పలువురు కూటమి నేతలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. దంపతుల అనుబంధం ఇలాగే చిరకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

By Ramya