
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదీ జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ చెన్నైకి కృష్ణా జలాల విడుదలను ఏపీ ప్రభుత్వం రెట్టింపు చేసింది. ప్రస్తుతం 450 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేస్తున్నారు. దీంతో ఈ నెలాఖరు నాటికి కనీసం 2 టీఎంసీల కృష్ణా జలాలు చెన్నైకి చేరే అవకాశం ఉందని తమిళనాడు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
కృష్ణా జలాశయాల్లో మొత్తం 68.03 టీఎంసీలకు గాను ప్రస్తుతం సుమారు 14 టీఎంసీల నీరు మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ చెన్నై జలాశయాల నిల్వలను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నీటి విడుదలను పెంచిందన్నారు. అవసరమైతే తమ విజ్ఞప్తి మేరకు విడుదలను 500 క్యూసెక్కుల వరకు పెంచే అవకాశం ఉందని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 25న కండలేరు డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయగా, మార్చి 4న తమిళనాడులోని పూండి జలాశయానికి చేరింది. రిజర్వాయర్ నిర్వహణ పనుల కారణంగా మార్చి 29న విడుదల నిలిపివేశారు. అనంతరం మే 15 నుంచి 180-200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తూ వచ్చారు.
సాధారణంగా జూలై నుంచి అక్టోబర్ మధ్య చెన్నైకి 2 టీఎంసీల కృష్ణా జలాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి ఆగస్టు చివరి నాటికి 2 టీఎంసీలకు పైగా నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదనపు నీటితో చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి కొరతను తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

