
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ హెచ్చరించింది. కన్వీనర్ కోటా ఫీజు కంటే అధికంగా వసూలు చేయరాదని స్పష్టం చేసింది.
అడ్మిషన్ సమయంలో లేదా కోర్సు పూర్తైన తర్వాత విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీలు తమ వద్ద ఉంచుకోవడం నిబంధనలకు విరుద్ధమని కమిటీ కార్యదర్శి సూర్యచంద్రరావు తెలిపారు. సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం వెంటనే విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై జరిమానాలు విధించడంతో పాటు, అవసరమైతే అఫిలియేషన్ రద్దుకు యూనివర్సిటీలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు.
కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దు
ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థుల నుంచి కొన్ని ప్రైవేట్ కాలేజీలు ముందస్తుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. కన్వీనర్ కోటా విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నందున, అలాట్‌మెంట్ లెటర్‌లో చెల్లించాల్సిన కాలేజీ ఫీజును ‘జీరో’గా పేర్కొన్నారు.
అయితే కొన్ని కాలేజీలు ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదంటూ ముందుగా కొంత మొత్తాన్ని చెల్లించాలని విద్యార్థులను కోరుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన కమిటీ.. కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది.

