
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. వాస్తవానికి అక్టోబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని భావించినా.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పుతో పరిస్థితులు మారాయి. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు లింక్ ఏర్పడింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తేనే ఏపీకి 16వ ఆర్థిక సంఘం నుంచి రూ.3,700 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.2,138 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.1,562 కోట్లు కలిపి మొత్తం రూ.3,700 కోట్లు ఉన్నాయి.
మార్చిలోగా ఎన్నికలు పూర్తి చేయాల్సిందే?
కేంద్రం నుంచి ఐదేళ్లలో ఏపీకి మొత్తం రూ.28,787 కోట్ల నిధులు రావాల్సి ఉంది. అయితే ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాలంటే స్థానిక సంస్థలకు ఎన్నికైన పాలక వర్గాలు ఉండటం తప్పనిసరి. అందుకే మార్చి గడువులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో పలుచోట్ల పాలకవర్గాల పదవీకాలం ఇప్పటికే ముగిసింది. గతంలో కోర్టు కేసులు, ఇతర కారణాలతో కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ కూడా నిలిచిపోయింది.
రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన తర్వాతే నోటిఫికేషన్
బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తే.. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది.
గత ప్రభుత్వ హయాంలో 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు రూ.615 కోట్ల నిధులను రాష్ట్రం కోల్పోయింది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా.. ఎన్నికలను గడువులోగా పూర్తి చేసి కేంద్ర నిధులను పొందాలని ప్రభుత్వం భావిస్తోంది.
