
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పులు తీర్చలేనని చెబుతూ ఓ వ్యక్తి ఏకంగా స్థానిక చౌడేశ్వరి అమ్మవారి ఆలయానికి కూడా ఐపీ నోటీసు పంపించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
యాడికికి చెందిన మోహన్ ఇంటి వద్ద చిట్టీలు నిర్వహించేవాడు. చిట్టీల్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తానని చెప్పడంతో పలువురు అతడికి భారీగా డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు మోహన్‌ను నిలదీశారు.
మోహన్‌కు మొత్తం 56 మంది నుంచి సుమారు రూ.1.65 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. వీరిలో స్థానిక చౌడేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ కూడా ఉందని తెలుస్తోంది. ఆలయానికి మోహన్ రూ.3 లక్షలకు పైగా బాకీ ఉన్నట్లు సమాచారం.
అప్పులు తీర్చే పరిస్థితి లేదంటూ మోహన్ కోర్టును ఆశ్రయించి ఐపీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.1.50 కోట్ల మేర అప్పులు ఇచ్చిన వారికి, ఆలయ కమిటీకి కూడా ఈ నోటీసులు వెళ్లడంతో విషయం తెలిసిన వారు ఆశ్చర్యపోయారు.
ఐపీ నోటీసు అంటే ఏమిటి?
ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ (Insolvency Petition). అప్పులు చెల్లించే ఆర్థిక స్థోమత లేదని, తన ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ వ్యక్తి లేదా సంస్థ కోర్టును ఆశ్రయించే ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియలో రుణదాతలకు కూడా సమాచారం అందుతుంది.
అయితే సాధారణంగా వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన అప్పుల విషయంలో కనిపించే ఐపీ నోటీసు.. ఈ ఘటనలో ఏకంగా అమ్మవారి ఆలయానికి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
