
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 51,902 నామినేషన్లు, 659 జెడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం ఎంపీటీసీ స్థానాలకు 25,016, జెడ్పీటీసీ స్థానాలకు 3,315 నామినేషన్లు వచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎంపీటీసీ స్థానాలకు పార్టీల వారీగా నామినేషన్లు
రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ తరఫున 22,013 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 20,556 నామినేషన్లు సమర్పించారు. జనసేన పార్టీ నుంచి 4,609, బీజేపీ తరఫున 1,150 నామినేషన్లు దాఖలయ్యాయి.
జెడ్పీటీసీ స్థానాల విషయానికొస్తే టీడీపీ తరఫున 2,078 నామినేషన్లు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ నుంచి 1,815, జనసేన నుంచి 679, బీజేపీ తరఫున 255 నామినేషన్లు దాఖలయ్యాయి.
జగన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ వ్యాఖ్యలను కూటమి పార్టీల నేతలు తప్పుబడుతున్నారు. బెంగళూరు నుంచి అమరావతికి వచ్చి ప్రెస్‌మీట్లు పెట్టి ఆరోపణలు చేయడం మినహా ఆయన చేస్తున్నదేమీ లేదంటూ విమర్శిస్తున్నారు.
జగన్ వ్యవహారశైలిని ‘హిట్ అండ్ రన్ థియరీ’గా అభివర్ణిస్తూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో భారీగా నామినేషన్లు దాఖలవుతున్న తరుణంలో ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
