
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన వాహన పేలుడు ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. అనంతగిరి మండలం పినకోట సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల కోసం టిప్పర్ వాహనంలో డీజిల్ తరలిస్తుండగా మరో వాహనాన్ని ఢీకొనడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు కలెక్టర్ వివరించారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
పేలుడుకు గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని సూచించారు. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
