ప్రభుత్వ పనితీరును బట్టే ప్రజలు తీర్పు ఇస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రౌడీయిజం నేరాలకు పాల్పడే వారిని ప్రజలు ఎవరూ హర్షించరని పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధి, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై స్పందించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజాన్ని నియంత్రించేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేశానని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పట్లో హైదరాబాద్‌లో నెల రోజుల పాటు కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఉండేదని, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు.

అప్పటి నుంచి హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఎదురయ్యే కొత్త సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగామని చెప్పారు. గత పదేళ్లలో శాంతిభద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని వివరించారు.

2019-24 మధ్య అరాచక పాలన సాగింది

2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగిందని చంద్రబాబు విమర్శించారు. అనేక రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారని అన్నారు.

వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే కేటాయించి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి సారించామని ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమ రైజింగ్‌ ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

కేంద్ర నిధుల కోసం స్థానిక ఎన్నికలు కీలకం

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 96 పథకాల కింద రావాల్సిన నిధులను గతంలో మళ్లించారని చంద్రబాబు ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలను సరిదిద్దామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 16వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన నిధులపై ప్రభావం పడుతుందని చెప్పారు.

ఆ నిధులు అందకపోతే స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడుతుందని వివరించారు. స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి 59 పిటిషన్లు దాఖలు చేశారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేశామని, బీసీలు ఉన్న ప్రాంతాల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించేలా సీట్లు కేటాయించామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు వైసీపీ అడ్డుపడుతోందని, ఎస్‌ఐఆర్‌ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించిందని ఆరోపించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *