
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలను ‘మావోయిస్టు మనస్తత్వం గల వ్యక్తులు’గా పేర్కొనలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పి. చిదంబరం సహా పలువురు చేసిన విమర్శలకు ఆయన స్పందించారు.
‘ఎక్స్’ వేదికగా రిజిజు వివరణ ఇస్తూ.. ‘దిమాగీ నక్సల్స్’ అనే పదాన్ని రాజ్యాంగాన్ని తిరస్కరించే మావోయిస్టు అనుకూలులు, వేర్పాటువాదులకు మద్దతిచ్చేవారు, ఆర్టికల్ 370కు అనుకూలంగా నిలిచేవారిని ఉద్దేశించే ఉపయోగించినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి వేరు చేయాలంటూ ‘చికెన్ నెక్’ను కత్తిరించాలని పిలుపునిచ్చే వారిని కూడా ఈ వ్యాఖ్యలు సూచిస్తాయని పేర్కొన్నారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ దేశ అభివృద్ధిని అడ్డుకునే ‘దిమాగీ నక్సల్స్’ కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం స్పందిస్తూ.. తాను ‘దిమాగీ నక్సల్ కావడం గర్వంగా ఉంది’ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
మరోవైపు దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ప్రధాని వ్యాఖ్యలపై స్పందించారు. యువతను రాజకీయ లేబుళ్లతో కాకుండా విద్య, విమర్శనాత్మక ఆలోచన, మానసిక ఆరోగ్యంపై అవగాహన వంటి మార్గాల ద్వారా ప్రభావితం చేయాలని సూచించారు. రాజకీయంగా వ్యక్తులకు లేబుళ్లు వేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

