
గుంటూరు నుంచి శ్రీలంకకు ఎగుమతి చేసిన ఎండు మిర్చిని అక్కడి అధికారులు తిరస్కరించారు. మిర్చిలో అఫ్లోటాక్సిన్, తేమ శాతం నిర్దేశిత పరిమితికి మించి ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో పదుల సంఖ్యలో కంటెయినర్లను వెనక్కి తీసుకెళ్లాలని ఆదేశించారు.
జూలైలో గుంటూరు నుంచి చెన్నై పోర్టు మీదుగా శ్రీలంకకు మిర్చిని ఎగుమతి చేశారు. అక్కడి శ్రీలంక స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ అధికారులు శాంపిల్స్ సేకరించి పరీక్షించగా నాణ్యతా ప్రమాణాలు సరిపోలేదని తేలింది.
దీంతో వ్యాపారులు శ్రీలంక అధికారులతో చర్చలు జరుపుతున్నారు. తిరస్కరించిన సరుకును వెనక్కి తీసుకొస్తే రీప్యాకింగ్, స్థానిక విక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని సుగంధ ద్రవ్యాల బోర్డు దృష్టికి తీసుకెళ్లారు.
ఇటీవల చైనా కూడా గుంటూరు మిర్చి ఎగుమతులను తిరస్కరించగా.. తాజాగా శ్రీలంక నిర్ణయంతో మిర్చి వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. రైతులు సాగు, కోత, నిల్వ సమయంలో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వ్యాపారులు సూచిస్తున్నారు.

