భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ముగ్గురు నేతలు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రత్యేక సందేశాలను పంచుకున్నారు.

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన భారతదేశానికి రాజ్యాంగం దిశానిర్దేశం చేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి గొప్ప విలువలతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం పునాది వేసిందని తెలిపారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు.

దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేసిన రాజ్యాంగ నిర్మాతల సేవలను స్మరించుకున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించడంతో పాటు అది నిర్దేశించిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సుపరిపాలన లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

రాజ్యాంగం అనేది దేశాన్ని నిర్వచించే పత్రం మాత్రమే కాదని ప్రజల గౌరవం, హక్కులు, ఆకాంక్షలకు రక్షణగా నిలిచే వాగ్దానమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ప్రజాస్వామ్య ఆదర్శాల పట్ల మన నిబద్ధతను మరోసారి చాటుకోవాలని అన్నారు.

రాజ్యాంగం మన హక్కులకు రక్షణ కవచంగా నిలుస్తూనే బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజ్యాంగ విలువలను గౌరవించాలని ప్రజాస్వామ్య సంస్థలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సమ్మిళిత, ప్రగతిశీల భారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తించాలని సూచించారు.

మంత్రి నారా లోకేశ్ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు భారత రాజ్యాంగం ప్రతిరూపమని పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని అన్నారు.

ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో విశేష కృషి చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ నిర్మాతలందరి సేవలను స్మరించుకోవాలని లోకేశ్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *