అటవీ ప్రాంతాల్లో నిఘా గస్తీని మరింత ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల అక్రమ వేటకు ఉపయోగిస్తున్న బ్రేక్ వైర్ల ఉచ్చుల తయారీ వినియోగాన్ని అరికట్టేందుకు ఆటోమొబైల్ షాపుల యజమానులు మోటార్ మెకానిక్‌లకు అవగాహన కల్పించాలని సూచించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అటవీ శాఖ సిబ్బంది చేపట్టిన ప్రత్యేక పెట్రోలింగ్‌లో 69 వేట ఉచ్చులను గుర్తించి తొలగించారు. రిజర్వ్ ఫారెస్ట్‌లోని కంపార్ట్‌మెంట్ నంబర్ 26/4లో బుధవారం నిర్వహించిన ఈ తనిఖీల్లో మూడు చక్రాల వాహనాల బ్రేక్ వైర్లతో తయారు చేసిన ఉచ్చులను అధికారులు గుర్తించారు. వాటిని తొలగించి వన్యప్రాణులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించారు.

ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు యానిమల్ ట్రాకర్లు బేస్ క్యాంప్ సిబ్బందిని పవన్ కల్యాణ్ అభినందించారు. అటవీ సంపద వన్యప్రాణుల పరిరక్షణ కోసం సిబ్బంది చూపుతున్న అప్రమత్తత అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు. నిరంతర గస్తీ, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషితో అనేక వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు తప్పిందని తెలిపారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ అడవుల్లో ఏర్పాటు చేసే ప్రతి ఉచ్చు ఒక వన్యప్రాణి ప్రాణానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఉచ్చులను గుర్తించి తొలగించడం జీవవైవిధ్య పరిరక్షణలో కీలకమైన చర్యగా అభివర్ణించారు. బ్రేక్ వైర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆటోమొబైల్ రంగానికి చెందిన వ్యాపారులు మెకానిక్‌లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అలాగే వేటగాళ్ల బారి నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా ప్రత్యేక పెట్రోలింగ్‌ను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *