D Educt: Oct 30: ఇన్‌సర్వీస్‌ వైద్యులకు పీజీ సీట్ల కేటాయింపు నిబంధనల్లో మార్పులు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న అర్హులైన ఇన్‌సర్వీస్‌ వైద్యులకు 2026-27 విద్యా సంవత్సరంలో పీజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర కోటా సీట్ల కేటాయింపు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం వివిధ వైద్య స్పెషాలిటీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్‌ శాతాలను నిర్ణయించింది.

ఎండీ డెర్మటాలజీ, వెనెరాలజీ, లెప్రాలజీ (డీవీఎల్‌), సైకియాట్రీతో పాటు ఎంఎస్‌ ఆఫ్తల్మాలజీ, ఈఎన్‌టీ కోర్సులకు 5 శాతం చొప్పున సీట్లు కేటాయించారు. ఎంఎస్‌ ఆర్థోపెడిక్‌, ఎండీ పాథాలజీ, ప్రివెంటివ్‌ మెడిసిన్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులకు 10 శాతం చొప్పున రిజర్వేషన్‌ కల్పించారు.

ఎండీ అనస్థీషియాలజీ, పీడియాట్రిక్స్‌, జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, రేడియో డయాగ్నసిస్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌, రేడియోథెరపీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఎంఎస్‌ ప్రసూతి-స్త్రీ వైద్యం తదితర కోర్సులకు 15 శాతం చొప్పున సీట్లు కేటాయించారు. ఇక ఎండీ మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, సోషల్‌ అండ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ కోర్సులకు 30 శాతం చొప్పున రిజర్వేషన్‌ కల్పించారు.

మరోవైపు ప్రభుత్వ సర్వీసులో పీజీ డిప్లొమాతో చేరిన వైద్యులు పీజీ మెడికల్‌ డిగ్రీ చదివేందుకు అనుమతించే డిప్యుటేషన్‌ వ్యవధిని కూడా ప్రభుత్వం పెంచింది. గతంలో ఈ గడువు ఏడాది ఉండగా, ఇప్పుడు ప్రభుత్వ స్పాన్సర్‌షిప్‌ లేకుండా పీజీ డిప్లొమా పూర్తి చేసిన వైద్యులు అదే స్పెషాలిటీలో పీజీ డిగ్రీ చేయాలనుకుంటే 24 నెలల డిప్యుటేషన్‌ కల్పించనున్నారు. వేరే స్పెషాలిటీలో పీజీ డిగ్రీ అభ్యసించాలనుకునే వారికి ఈ గడువును 36 నెలలుగా నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *