బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ కీలక తీర్పు వెలువరించింది. వయోజనులైన పిల్లలు స్వతంత్ర వ్యక్తులని, వారు తల్లిదండ్రుల ఆస్తి కాదని స్పష్టం చేసింది. తనకు నచ్చిన వ్యక్తితో కలిసి జీవిస్తున్న మేజర్‌ కుమార్తెను తన వద్దకు అప్పగించాలని కోరుతూ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

వయోజనులకు తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ, ఎక్కడ జీవించాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఉందని న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తి అక్రమ నిర్బంధంలో ఉన్నట్లు నిరూపణ లేనప్పుడు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ ద్వారా కస్టడీ కోరడం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.

వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణకు సంబంధించి బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వయోజనులైన పిల్లలు స్వతంత్ర వ్యక్తులని, వారు తల్లిదండ్రుల ఆస్తి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

మేజర్‌ అయిన యువతీ యువకులు తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకునే పూర్తి హక్కు, స్వేచ్ఛ కలిగి ఉంటారని పేర్కొంది. వారి వ్యక్తిగత నిర్ణయాల్లో తల్లిదండ్రులు లేదా ఇతరులు జోక్యం చేసుకోవడం సమర్థనీయం కాదని కోర్టు తేల్చి చెప్పింది. వ్యక్తిగత స్వేచ్ఛ, తమ జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో భాగమని స్పష్టం చేసింది.

నాగ్‌పూర్‌కు చెందిన ఓ యువతి 17 ఏళ్ల వయస్సులో ట్యూషన్‌ క్లాస్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆ యువతి ఓ యువకుడితో కలిసి వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం ఆమెను గుర్తించి తల్లికి అప్పగించారు.

అయితే కొంతకాలం తర్వాత ఆ యువతి మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయి అదే యువకుడి వద్దకు చేరుకుంది. దీంతో తన కుమార్తె కస్టడీని తనకు అప్పగించాలని కోరుతూ తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె మైనర్‌గా ఉన్న సమయంలో సదరు యువకుడు ఆమెను అక్రమంగా తన వద్ద ఉంచుకున్నాడని తల్లి ఆరోపించింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయలేదని కూడా ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది.