
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే సమయంలో ఎమ్మెల్యే విరూపాక్షి అక్కడే ఉండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేశారు.
ప్రస్తుతం కర్నూలు సబ్ జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం కర్నూలుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేను కలిసి తాజా పరిణామాలపై వివరాలు తెలుసుకోనున్నారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆగస్టు 13న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో అరెస్టైన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు ఆయన కర్నూలుకు వెళ్లనున్నారు.
పర్యటనలో భాగంగా గురువారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరుతారు. అనంతరం కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి పంచలింగాల సమీపంలోని కర్నూలు జిల్లా జైలుకు వెళ్లనున్నారు. జైలులో ములాఖత్ ద్వారా ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసి ఆయనతో మాట్లాడనున్నారు. ఎమ్మెల్యే అరెస్టుకు దారితీసిన పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై జగన్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.
అరెస్టైన రోజు రాత్రి చోటుచేసుకున్న పరిణామాలు, ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను వైఎస్ జగన్ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలతోనూ ఆయన సమావేశమై పరిస్థితులపై ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.
జైలులో ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం ఆయన కర్నూలు నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.

