
ఆర్నబ్ తుఫాన్ బాధితులను ఆదుకోవడమే తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల కంటే ప్రజల సంక్షేమం బాధితులకు సహాయం అందించడమే తమకు ముఖ్యమని పేర్కొన్నారు.
శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెట్రేవు గ్రామంలో తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ ప్రారంభమైనప్పటి నుంచి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు.
తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ నిండాయని రాబోయే రబీ సీజన్‌లో సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎం వెల్లడించారు. ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రజల్లో తుఫాన్‌పై అవగాహన కల్పించడంతో పాటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని వివరించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయి సమాచారంతో అనుసంధానించి పరిస్థితులను సమీక్షించడం వల్ల ప్రాణనష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామని చంద్రబాబు తెలిపారు. అయితే దురదృష్టవశాత్తూ ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు.
తుఫాన్ రోజున సుమారు 12,500 చెట్లు, 4,500 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని సీఎం వెల్లడించారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తెలంగాణ నుంచి కూడా సిబ్బందిని పంపాలని కోరినట్లు తెలిపారు. ఎల్లుండి ఉదయానికి గృహాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని ఆ తర్వాత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరిస్తామని చెప్పారు.
అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థను శనివారం ఉదయానికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఆదివారం లేదా సోమవారం కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
