
తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆర్నబ్ తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలపై శుక్రవారం కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం తీర ప్రాంత గ్రామాల ప్రజలతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. వేటకు వెళ్లే పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించి అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
దీపావళి పండుగ అనంతరం తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో స్వయంగా పర్యటిస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టేందుకు చేపట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని, వారికి శాశ్వత ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
