పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణకు పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రలు వికటించి గిరిజన బాలిక మృతి చెందింది. ఈ ఘటనలో చిన్నారులు సహా 57 మంది వరకు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, పోలవరం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో పాటు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

గ్రామంలో 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి, మరో 24 మందిని లక్ష్మీపురం పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాకినాడ జీజీహెచ్ నుంచి 9 మంది సభ్యులతో వైద్య బృందాన్ని పంపగా, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ నుంచి మరో మూడు బృందాలు గ్రామానికి బయల్దేరాయి.

ఘటనపై ఇన్‌చార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా అధికారులతో సమీక్షించారు. గ్రామంలో వైద్య సేవలు కొనసాగించాలని, చికిత్స పొందుతున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *