
రాష్ట్రంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా.. రేవంత్ రెడ్డి పేరు రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో నమోదై ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉండకూడదనే నిబంధన ఉన్నప్పటికీ.. సీఎం పేరు అటు కొడంగల్, ఇటు అచ్చంపేట ఓటర్ల జాబితాలో ఒకే ఐడీ నంబర్‌తో కనిపించడం చూసి అంతా ఆశ్యర్యపోతున్నారు. సీఎంకు కూడా ఏడాది జైలుశిక్ష పడే అవకాశం ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి సంబంధించి ఓ వివాదాస్పదమైన విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అత్యున్నత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ.. ఆయన పేరు రెండు వేర్వేరు పార్లమెంటరీ పరిధుల్లోని రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో నమోదై ఉన్నట్లు అధికారిక ఓటరు నమోదు డేటా ద్వారా స్పష్టమవుతోంది. 1950 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఏ పౌరుడూ కూడా ఒకటి కంటే ఎక్కువ నియోజక వర్గాల ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హుడు కాదనే నిబంధన ఉండటంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుత ఓటర్ల జాబితా రికార్డుల ప్రకారం.. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వచ్చే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓటరుగా నమోదై ఉన్నారు. అదే సమయంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం పరిధిలోని అచ్చంపేట అసెంబ్లీ నియోజక వర్గం ఓటర్ల జాబితాలో కూడా ఆయన పేరు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు చోట్లా ఉన్న ఓటరు నమోదు పత్రాలలో ఆశ్చర్యకరంగా ఒకే ఒక ఎలక్షన్ ఐడీ కార్డ్ నంబర్ (టీఈS0274035) ఉండటం గమనార్హం. అచ్చంపేట పరిధిలోని వాంగూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని ఆయన నివాస గృహ నంబర్ 3-48 అడ్రస్‌తో ఒక ఓటు ఉంటే.. కొడంగల్ పరిధిలో హౌస్ నంబర్ 1-209 అడ్రస్‌తో రెండో ఓటు నమోదై ఉంది.

